Pawan Kalyan: పౌరసత్వ చట్టంపై తన వైఖరిని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్

  • గాంధీ, నెహ్రూలు కోరుకున్నదే మోదీ చేస్తున్నారు
  • మూడు దేశాల్లోని మైనార్టీలను ఆదుకోవాల్సింది మనమే
  • సీఏఏపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర్థించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు పలికారు. దేశ విభజన అనంతరం పాకిస్థాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్పు చెందిందని... ఆ తర్వాత అక్కడున్న మైనార్టీలు ఊచకోతకు గురయ్యారని చెప్పారు. పాకిస్థాన్ లో మైనార్టీలు ఎలాంటి అణచివేతకు గురవుతున్నారో పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారని... కనేరియా తీవ్ర వివక్షకు గురయ్యారని పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ షోయభ్ అఖ్తర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు.

విజయవాడలో బీజేపీ, జనసేన భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏఏపై పవన్ మాట్లాడతారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూడా మైనార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... వాళ్లను ఎవరు కాపాడతారని పవన్ ప్రశ్నించారు. ఆ మూడు దేశాల్లో వివక్షను ఎదుర్కొంటూ, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులను కాపాడాల్సింది భారతదేశమేనని చెప్పారు. పాకిస్థాన్ లోని మైనార్టీలకు సమస్యలు తలెత్తితే మనమే కాపాడాలని గాంధీ, నెహ్రూ చెప్పారని... వారు కోరుకున్నదాన్ని ప్రధాని మోదీ చేస్తున్నారని తెలిపారు.

సీఏఏకు మతం రంగు పులిమి, అపోహలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఇతర మతస్తులకు పౌరసత్వాన్ని కల్పించి, ముస్లింలకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం దేశాలైన ఆ మూడు దేశాల్లో ముస్లింలదే ఆధిపత్యమని, అక్కడ వారికి ఎలాంటి సమస్యలు లేవని... కేవలం మైనార్టీలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని... అందుకే అక్కడి మైనార్టీలకు అండగా ఉండాలని సీఏఏను తీసుకొచ్చారని చెప్పారు. సీఏఏతో మన దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మన దేశంలోని మైనార్టీలు వివక్షకు గురి కావడం లేదని... అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.

More Telugu News