Kanna Lakshminarayana: అందుకే పవన్ ను మనస్ఫూర్తిగా స్వాగతించాం: కన్నా

  • పవన్ ఎలాంటి షరతులు విధించలేదన్న కన్నా
  • మోదీ నాయకత్వంపై నమ్మకంతో ముందుకు వచ్చారని వెల్లడి
  • టీడీపీ, వైసీపీ దొందూ దొందేనని వ్యాఖ్యలు

విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో బీజేపీ, జనసేన అగ్రనేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ, జనసేన భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఎలాంటి షరతులు లేకుండా తమతో చేయి కలిపేందుకు ముందుకు వచ్చారని, అందుకే ఆయనను మనస్ఫూర్తిగా స్వాగతించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై పవన్ నమ్మకం ఉంచారని అన్నారు.

ఈ క్రమంలో కన్నా టీడీపీ, వైసీపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ చేసిన తప్పులు చూపించి ఒక్క చాన్స్ అంటూ వైసీపీ వచ్చిందని అన్నారు. వైసీపీ పాలనలో కుటుంబం, కులం, అవినీతి అంశాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కుటుంబం, కులం, అవినీతి అంశాల్లో టీడీపీ, వైసీపీ ఒకటేనని వ్యాఖ్యానించారు. జగన్ నియంతృత్వ పోకడలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు చేయి కలిపాయని వెల్లడించారు.

More Telugu News