Andhra Pradesh: చీకట్లు తొలగిపోయే చారిత్రాత్మక దినం ఇది: సునీల్ దేవధర్

  • విజయవాడలో బీజేపీ, జనసేన భేటీ
  • మీడియాతో మాట్లాడిన సునీల్ దేవధర్
  • కలిసి పనిచేస్తున్నామంటూ అధికారిక ప్రకటన

ఏపీ రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా బీజేపీ, జనసేన భాగస్వామ్యం ఖరారైంది. విజయవాడలో సమావేశమైన బీజేపీ, జనసేన అగ్రనేతలు ఏపీలో రెండు పార్టీలు కలిసిపనిచేస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ మాట్లాడారు. ఏపీ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక దినం అని పేర్కొన్నారు. కన్నా, పవన్ బీజేపీ, జనసేన పొత్తు నిర్ధారించారని, ప్రజల సంక్షేమం కోసం తాము కలిసి పనిచేయబోతున్నామని, పోరాడబోతున్నామని ఉద్ఘాటించారు. కుల రాజకీయాలు, అవినీతి అంతం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

"మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగకు ఓ విశిష్టత ఉంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే పగటిపూట నిడివి పెరుగుతుంది. తద్వారా రాత్రి పూట నిడివి తగ్గుతుంది. అంటే సూర్యుడి రాకతో చీకట్లు తొలగిపోతాయని భావించాలి. సూర్యుడి రాకతో చీకట్లు తొలగిపోవడమే కాదు కమలం కూడా వికసిస్తుంది. జనసేన భాగస్వామ్యంతో 2024లో పూర్తి మెజారిటీతో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

ఈ కొద్ది సమయంలో మాకు అర్థమైంది ఏంటంటే, ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబునాయుడు అంతకుముందే ఫెయిలయ్యారు. మరోసారి చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీతో ఏ విధమైన పొత్తు కానీ, భాగస్వామ్యం కానీ ఉండదు. ఇదే మాట వైసీపీకి కూడా వర్తిస్తుంది. ఆ పార్టీతోనూ బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోదు.

టీడీపీ, వైసీపీలతో తెరవెనుక, తెరముందు ఎలాంటి బంధం లేదు. ఇకపై ఉండబోదు. ఏపీలో బీజేపీ కేవలం జనసేనతోనే కలిసి పనిచేస్తుంది. కులతత్వం, కుటుంబ పాలన, వారసత్వ పాలనకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతోంది. ఏపీ ప్రజల హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తాం. ఎలాంటి అన్యాయాలను, అక్రమాలను అనుమతించేది లేదు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య సమన్వయం ఉంటుందని భావిస్తున్నాం" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు

More Telugu News