Pawan Kalyan: బీజేపీతో కలిసి పని చేస్తాం.. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్

  • 2024లో బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది
  • రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు
  • మోదీ అభీష్టం మేరకు కలిసి పని చేస్తాం

రాష్ట్ర ప్రజల రక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో చేతులు కలిపామని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. మోదీని ఇష్టపడేవారు, జనసేన భావజాలాన్ని మెచ్చినవారంతా ఒక గూటికిందకు వచ్చామని తెలిపారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ భావజాలం ఒకటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. బీజేపీతో కలిసి పని చేస్తామని...2024లో ఏపీలో బీజేపీ, జనసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ, వైసీపీల ప్రభుత్వాలతో ప్రజలు విసిగి పోయారని... ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని... ఆ ప్రత్యామ్నాయమే బీజేపీ, జనసేన అని చెప్పారు. గత ప్రభుత్వం అవకతవకలతో నిండిపోయిందని, ప్రస్తుతం పాలెగాళ్ల ప్రభుత్వం నడుస్తోందని ఏపీ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్లామని తెలిపారు. రాజధాని రైతులను నిండా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అభీష్టం మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.

రెండు పార్టీల మధ్య అవగాహన కోసం కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. ఇరు పార్టీల నేతలు ప్రజలతో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందించుకుని బలంగా ముందుకు సాగుతామని చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం రాష్ట్రానికి చాలా మంచిదని తెలిపారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని చెప్పారు.

More Telugu News