Kondaveeti Jyothirmayee: రాజధాని కోసం త్యాగాలు చేసి తిట్లు తినడం ఇక్కడే చూస్తున్నాం: కొండవీటి జ్యోతిర్మయి

  • రాజధాని రైతులకు మద్దతు పలికిన కొండవీటి జ్యోతిర్మయి
  • రైతు దంపతుల కాళ్లు కడిగిన గాయని 
  • అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యలు

రాజధాని అమరావతి కోసం తుళ్లూరులో రైతులు చేస్తున్న ఉపవాస దీక్షకు ప్రముఖ గాయని, ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె ఓ రైతు దంపతుల కాళ్లు కడగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కొండవీటి జ్యోతిర్మయి మాట్లాడుతూ, అన్నదాతలను గౌరవించుకోవడం మన సంస్కృతి, సంప్రదాయం అని వెల్లడించారు. అందుకే రైతుల కాళ్లు కడిగి పాదాభివందనం చేశానని వివరించారు. అన్నదాతల ఆవేదన రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు.

ఎంతమంది ఎన్ని తిట్టినా సహనంతో పోరాటం కొనసాగిస్తున్నారని రైతులను అభినందించారు. 30 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వానికి ఇవ్వడం ఎక్కడా జరగలేదని, రాజధాని కోసం త్యాగాలు చేయడం, తిట్లు తినడం ఇక్కడే చూస్తున్నామని అన్నారు. పండుగ నాడు కళకళలాడాల్సిన పల్లెల్లో పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పేర్కొన్నారు.

More Telugu News