Visakhapatnam District: ముచ్చటగా పెళ్లి...అంతా ఉత్తుత్తినే: విశాఖ జిల్లాలో తరతరాల సంప్రదాయం

  • భోగిరోజు యువకునికి, రజస్వల కాని బాలికకు పెళ్లి తంతు
  • ఊరంతా సామూహిక భోజనాలు 
  • ఓ సామాజికవర్గంలో కొనసాగుతున్న ఆనవాయితీ

ఆచార సంపద్రాయాల పునాదులపై భారతీయ సంస్కృతి వెలుగొందుతోంది. కాలం మారినా, ఆధునికత వెర్రితలలు వేస్తున్నా ఆచార సంప్రదాయాలకు విలువనిచ్చే కులాలు, గ్రామాలు ఇంకా ఉన్నాయనేందుకు ఇది ఉదాహరణ. 

విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గంలో మూడువందల ఏళ్ల నుంచి ఓ ఆనవాయితీ కొనసాగుతోంది. అదేంటంటే, భోగిరోజు యువకునికి, రజస్వల కాని బాలికకు ఉత్తుత్తి పెళ్లి జరిపించడం. అలా అని ఏదో తూతూ మంత్రంగా జరిపించేయరు.

సాధారణ పెళ్లి తంతుకు ఏ మాత్రం తీసిపోని విధంగా వివాహ వేడుక ఉంటుంది. నిన్న భోగి సందర్భంగా వివాహ వేడుకను ఘనంగా జరిపించారు. దుక్కవాని కుటుంబానికి చెందిన యువకుడికి, మరో కుటుంబానికి చెందిన బాలికకు మధ్య పెళ్లి జరిపించారు.

తొలుత గ్రామంలోని అచ్చియ్యమ్మ పేరంటాలు గుడికి వధూవరులను తోడ్కొని చీరసారెతో మొక్కు తీర్చుకునేందుకు మేళతాళాలతో తరలివచ్చారు. తొలుత వధూవరులతో పూజలు చేయించారు. అనంతరం గ్రామస్తులంతా పూజలు నిర్వహించారు. తర్వాత వధూవరుల కుటుంబాల వారు కూర్చుని పెళ్లి జరిపించారు.

కొత్త జంటను అంతా ఆశీర్వదించారు. సహపంక్తి భోజనాలు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు నూతన వధూవరుల అప్పగింతల ప్రక్రియ పూర్తిచేసుకుని ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఇదో సంప్రదాయం మాత్రమే.

ఆ తర్వాత ఈ వివాహ వేడుక గురించి ఎవరూ పట్టించుకోరు. వధూవరుల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. పెద్దయ్యాక ఎవరికి నచ్చిన వారిని వారు పెళ్లి చేసుకుంటారు. ఈ వివాహంపై వివాదం కూడా ఉండదు. ఏళ్లుగా వస్తున్న ఆచారం మేరకు జరిపే ఉత్తుత్తి పెళ్లి ఇదని గ్రామస్థులు బాహాటంగానే చెబుతారు.

More Telugu News