India: టీమిండియాకు ఘోర పరాభవం... సెంచరీలతో ఉతికారేసిన ఆసీస్ ఓపెనర్లు

  • తొలి వన్డేలో ఆసీస్ విక్టరీ
  • 10 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
  • ఒక్క వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్

ఇటీవల కాలంలో గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తున్న టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. ముంబయి వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఆసీస్ అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరుస్తూ 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది.

256 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 74 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 128; 17 ఫోర్లు, 3 సిక్సులు), ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110; 13 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో భారత బౌలింగ్ ను చీల్చి చెండాడారు.

వీరిద్దరి ధాటికి భారత ఆటగాళ్లకు గానీ, అభిమానులకు గానీ ఏ దశలోనూ మ్యాచ్ ను గెలుస్తామన్న ఆశలు కలగలేదు. బుమ్రా, షమీ, ఠాకూర్, కుల్దీప్, జడేజా వంటి బౌలర్లు సైతం వార్నర్, ఫించ్ ముందు సాధారణ బౌలర్లుగా మారిపోయారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. రెండో వన్డే జనవరి 17న రాజ్ కోట్ లో జరగనుంది.

More Telugu News