cpi Ramakrishna: వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది: సీపీఐ రామకృష్ణ

  • ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు వీధినపడ్డారు
  • జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై విమర్శలు
  • రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయింది

అమరావతి రైతులకు మద్దతుగా సంక్రాంతి పండగ జరుపుకోవడం లేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో అమరావతి రైతులు వీధులపాలయ్యారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపైన, ఈ రెండు నివేదికలపైనా అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీపైనా విమర్శలు చేశారు.

హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్ లో భేటీ అవుతోందని, రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయిందని విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని మరోమారు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులపరంగా పాలనా వికేంద్రీకరణ జరగాలని, అయితే, జగన్ చెబుతున్న పాలనా వికేంద్రీకరణ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రాజధాని మార్పు అంశంపై జగన్ ఎవరితో చర్చించారని ప్రశ్నించారు.

More Telugu News