Nirbhaya: ఇక ఉరి తీయడమే.. నిర్భయ దోషుల పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!

  • మరో వారం రోజుల్లో నిర్బయ రేపిస్టులకు ఉరిశిక్ష
  • సుప్రీంకోర్టులో మెర్సీ పిటిషన్ వేసిన దోషులు
  • పిటిషన్ ను తిరస్కరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం

నిర్భయ రేపిస్టులకు ఉరే సరైన శిక్ష అని సర్వోన్నత న్యాయస్థానం స్ఫష్టం చేసింది. ఈ కేసులోని నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ శిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ చివరి ప్రయత్నంగా... నలుగురు దోషుల్లోని ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సుప్రీంకోర్టులో మెర్సీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... వారి పిటిషన్లను తిరస్కరించింది. మరో వారం రోజుల్లో వీరిని ఉరి తీయబోతున్నారు.

మరోవైపు, తనను ఉరి తీస్తే తన కుటుంబం మొత్తం నాశనమవుతుందని పిటిషన్ లో వినయ్ శర్మ పేర్కొన్నాడు. తన తండ్రి సంపాదన కుటుంబ పోషణకు సరిపోదని, తన కుటుంబానికి సేవింగ్స్ కూడా ఏమీ లేవని చెప్పాడు. ఆర్కేపురంలోని హరిజన్ బస్తీలో తన కుటుంబం ఉంటుందని తెలిపాడు. అయితే, వీరి విన్నపాలను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. అత్యంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఈ మానవ మృగాలను ఉరి తీయడమే సరైనదని తీర్పును వెలువరించింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లను ఉరి తీయబోతున్నారు. కేసులో ఐదో దోషి అయిన రామ్ సింగ్ 2013 మార్చ్ నెలలో జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

More Telugu News