జగన్... సునామీని ఆహ్వానిస్తున్నావ్... కొట్టుకుపోతావ్..: చంద్రబాబు నిప్పులు

14-01-2020 Tue 12:11
  • అమరావతి వద్దనే పార్టీలు నామరూపాల్లేకుండా పోతాయి
  • మూడు రాజధానులు ఓ పిచ్చి ఆలోచన
  • విజయవాడ బెంజ్ సర్కిల్ లో చంద్రబాబు
అమరావతిని తరలించాలని భావించడం ద్వారా, జగన్ తనంతట తాను ఓ సునామీని ఆహ్వానిస్తున్నారని, దానిలో పడి కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఎంతో మంది అమరావతి కోసం త్యాగాలు చేశారని, మరెందరో సాయం చేశారని వ్యాఖ్యానించిన ఆయన, పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలనూ నిర్మించుకున్న తరువాత రాజధానిని మారుస్తామని చెప్పడం అహంకారమేనని అన్నారు.

ఈ ఉదయం విజయవాడ, బెంజ్ సర్కిల్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన, రాజధాని తరలింపునకు మద్దతిచ్చే ఏ పార్టీ అయినా నామరూపాల్లేకుండా కొట్టుకు పోతుందని అన్నారు. ప్రస్తుతం రాజధాని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన దూరంలో ఉందని, ఇక్కడి నుంచి తొలగిస్తే, ఇతర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అన్నారు. మూడు కార్యాలయాలను తీసుకుని వెళ్లినంత మాత్రాన విశాఖలో అభివృద్ధి పరుగులు పెట్టదని, జరుగుతున్న అభివృద్ధి ఆగదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలో ఏ దేశానికీ మూడు రాజధానులు లేవని, ఇదో పిచ్చి ఆలోచనని అభివర్ణించిన ఆయన, అమరావతి పరిరక్షణ సమితికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అమరావతిని కాపాడుకునేందుకు తన పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకుని వెళతానని అన్నారు.