మాస్ కు 'సరిలేరు...', క్లాస్ కు 'అల...' రెండూ బంపరే... తేల్చేసిన ట్రేడ్ పండితులు!

14-01-2020 Tue 10:08
  • బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం
  • రూ. 100 కోట్లకు చేరువైన మహేశ్ సినిమా
  • వెనుకే పరిగెత్తుకు వస్తున్న 'అల వైకుంఠపురములో...'
  • 'దర్బార్'కు కూడా మంచి కలెక్షన్లు

ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలైన రెండు పెద్ద సినిమాలూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన' సరిలేరు నీకెవ్వరు', స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో..' చిత్రాలు, ఒక రోజు వ్యవధిలో వెండి తెరను తాకిన సంగతి తెలిసిందే. వీటిల్లో మహేశ్ చిత్రం మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా, బన్నీ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించింది.

తొలి రోజు కలెక్షన్లలో ఈ ఇద్దరు హీరోలూ తమతమ పాత రికార్డులను తిరగరాశారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తొలి రోజున దాదాపు రూ. 45 కోట్లను వసూలు చేయగా, 'అల వైకుంఠపురములో..' రూ. 30 కోట్ల వరకూ రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక విడుదలై నాలుగు రోజులైన 'సరిలేరు నీకెవ్వరు' ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ కు దగ్గర కాగా, ఈ వారంలోనే ఆ రికార్డు వచ్చేస్తుందని తెలుస్తోంది. బన్నీ సినిమా సైతం మరో వారం, పది రోజుల్లో ఈ రికార్డును తాకుతుందని సమాచారం.

ఈ రెండింటి కన్నా ముందు విడుదల అయిన సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'దర్బార్', ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ. 20 కోట్లకు పైగా షేర్ ను సాధించింది. తొలిరోజున కలెక్షన్లు మామూలుగా అనిపించినా, ఆపై థియేటర్లు తగ్గినా, సినిమా బాగుండేసరికి కలెక్షన్లు పుంజుకున్నాయి.

ఇక, రేపు కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా!' చిత్రం విడుదల కానుంది. ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలూ మంచి టాక్ ను తెచ్చుకోవడంతో, ఓ మోస్తరు సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. సినిమా బాగున్నా, థియేటర్లు పంచుకోవాల్సి రావడం, పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో 'ఎంత మంచివాడవురా!' ఏ మేరకు ప్రేక్షకులకు థియేటర్లను రప్పిస్తుందన్నది వేచి చూడాల్సిందే.