Telangana: ఎవరు ఎవరితో మిలాఖత్ అయ్యారో ప్రజలకు బాగా తెలుసు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

  • టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో అభివృద్ధి అటకెక్కింది
  • మాటలు తప్ప కేసీఆర్, కేటీఆర్‌లు ఒరగబెట్టిందేమీ లేదు
  • నిధులు వద్దని, ప్రధాని ప్రేమ కావాలని కేసీఆర్ అనలేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పట్టణాభివృద్ధి జరిగితే.. టీఆర్ఎస్ పాలనలో పట్టాణాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని స్పష్టం చేశారు. మాటలు తప్ప కేసీఆర్, కేటీఆర్‌లు తెలంగాణకు చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు.

పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో అవినీతి పెరిగిపోయిందని, రియల్ ఎస్టేట్ అక్రమాలు, లే అవుట్లు పెరిగిపోయాయన్నారు. బీజేపీతో కేసీఆర్ మిలాఖత్ అయిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్సేనని ఉత్తమ్ కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీకి కూడా అనుకూలంగా మాట్లాడింది వారేనని పేర్కొన్నారు. నిధులు వద్దని, ప్రధాని ప్రేమ ఉంటే చాలని గజ్వేల్ సభలో కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎవరు, ఎవరికి మద్దతు ఇస్తున్నారో తెలుసుకోవచ్చన్నారు.

సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ చెబుతోందని, నిజంగానే వాటిని వ్యతిరేకిస్తే కేరళలో చేసినట్టు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదని ఉత్తమ్ సూటిగా ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంటామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News