Chandrababu: ఆ సమయంలో నేను ఊ అంటే మనవాళ్లు చావగొట్టేవాళ్లు: చంద్రబాబు

  • అనంతపురంలో అమరావతి ర్యాలీ
  • హాజరైన చంద్రబాబు
  • ఉత్తేజపూరితంగా ప్రసంగం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు భావోద్వేగాలతో ప్రసంగించారు. రాజధాని అమరావతి మార్పు నేపథ్యంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

"మనకు సంప్రదాయం ఉంది. భోగి పండుగ నాడు పనికిరాని చెత్తనంతా మంటల్లో వేసేసి ఇంట్లో ఉన్న చెత్తంతా వదిలించుకుంటాం. అలాంటి చెత్త రిపోర్టులైన జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీలను భోగి మంటల్లో వేసి తగలేయండి. ఈ రాజధాని పోరాటం ప్రజలకు, జగన్ కు మధ్య జరుగుతోంది. ఓ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఎం వంటి పార్టీలన్నీ ఒకేతాటిపై నిలిచాయి. ఈ పార్టీలను నడిపిస్తోంది అమరావతి జేఏసీ. ఈ ఉన్మాది ముఖ్యమంత్రి దౌర్జన్యాలను ఎదుర్కొందాం. జేఏసీ మాత్రమే కాదు ప్రజలు కూడా బాధ్యత తీసుకుని పోరాడాలి. పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధమైన ప్రజల ఫొటోలు చూస్తే ఉన్మాది జగన్ కు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి.

రాజధాని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్నది అమరావతి మాత్రమే, విశాఖపట్నం కాదు. ఈ విషయం ఆ జగన్ కు చెప్పండి.  లండన్ లో నది ఉంది, పారిస్ లో నది ఉంది. ఇక్కడ కృష్ణా నది ఉంటే అమరావతి మునిగిపోతుందని అంటాడు. మళ్లీ ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. దమ్ముంటే విచారణ జరిపించుకోమని చెప్పాం. మీకు చేతకాకపోతే నోర్మూసుకుని కూర్చోండి. రాజధాని నిర్మాణానికి ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని అంటున్నాడు. నీకు చేతకాకపోతే ఈ రాజధానిలో మేం కట్టిన భవనాల్లోనే ఉండు. మళ్లీ మేం వచ్చి కట్టి చూపిస్తాం.

95లో హైదరాబాద్ అభివృద్ధి చెందిన సమయంలో మా వద్ద డబ్బుల్లేక జీతాలు కూడా ఇవ్వలేకపోయాం. కానీ తొమ్మిదేళ్లలో సైబరాబాద్, హైటెక్స్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, మెట్రో, అవుటర్ రింగ్ రోడ్డు అన్నీ చేశాం. ఈ జగన్ కు విజన్ లేదు, ఆయనకు తెలిసిందల్లా ఫ్రైడే మాత్రమే. రాజధాని విషయంలో మా అందరిపైనా ఎన్ని ఆరోపణలు చేయాలో అన్నీ చేశారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని చెప్పాం. నాడు రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే చేసుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు. రాజశేఖర్ రెడ్డి నన్ను తిట్టాడు కానీ హైదరాబాదుకు మాత్రం అడ్డుపడలేదు. జగన్ ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు.

అన్ని హంగులు ఉన్న అమరావతిని వదిలి విశాఖపై కన్నేశారు. అక్కడి వాళ్లు బెదిరిస్తే భయపడిపోతారు. ఒక ఆఫీసు తరలిస్తే ఉద్యోగాలు వస్తాయా. కియా వంటి సంస్థలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. సెక్రటేరియట్ మార్చితే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలవు జగన్ మోహన్ రెడ్డీ! పవన్ కల్యాణ్ ను, నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కానీ వాళ్లందరికీ నేనొక్కడ్ని సమాధానం చెప్పగలను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే జాగ్రత్తగా ఉండాలని ఖబడ్డార్ అంటూ అసెంబ్లీలోనే హెచ్చరించా.

పోలీసులు మంచివాళ్లే కానీ వాళ్లపై ఒత్తిళ్లు వస్తున్నాయి. మన పిల్లల భవిష్యత్ కు పోలీసులు కూడా సహకరించాలి. మన ఆడబిడ్డలను కాళ్లతో తన్ని హింసకు గురిచేయడం సరికాదు. అనంతపురం నేను రాకూడదంటారు. ఎవడబ్బ సొమ్ము అనంతపురం? పాలసముద్రంలో ఓ పదిమంది పెద్ద పుడింగిలు మాదిరిగా వచ్చారు. వాళ్లు ఓ నల్ల జెండా పట్టుకొచ్చారు. ఆ సమయంలో నేను ఊ అంటే మనవాళ్లు చావగొడతారు. నేనా పని చేయను. పోలీసులు ఉన్నారు కానీ వాళ్లను వదిలిపెట్టారు. నన్ను పరీక్షించాలని చూస్తున్నారు. నేను అనుకున్న పని సాధించే వరకు ప్రాణం పోయినా వదిలిపెట్టను.

అయితే అమరావతిని సాధించాల్సింది చంద్రబాబో, సీపీఐ రామకృష్ణనో మరెవరో కాదు. మీరే చేయాలి. మాకు వచ్చే బలం మీ దగ్గర్నుంచే. 17న హైపర్ కమిటీ మీటింగ్ అంట, 18న మళ్లీ క్యాబినెట్ మీటింగ్ అంట. 20న అసెంబ్లీ సమావేశాలంట! 21న మండలి సమావేశమంట. ఏం చేస్తారని అడుగుతున్నా, మార్చుతారా, ఈ ప్రజలు మార్చనిస్తారా? అని అడుగుతున్నా. కానీ అతను ఉన్మాది కాబట్టి మనం ఇంట్లో కూర్చోలేం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకు రావాలి, జేఏసీ కార్యక్రమాలు మరింత ఉద్ధృతం చేస్తున్నాం.

ఒకరు మూడు రాజధానులంటారు, మరొకరు మూడేంటి ముప్పై రాజధానులు కడతామంటారు. వీళ్ల అబ్బ సొమ్ము అయినట్టు మాట్లాడుతున్నారు. ఒక పిచ్చి తుగ్లక్ కు ముప్పై మంది తుగ్లక్ లు తయారయ్యారు. ఒక మంత్రి కోడిపందాలు ఆడితే మరో మంత్రి ఎడ్ల పందాలకు వెళతారు. ఈ ముఖ్యమంత్రి వీడియో గేములు ఆడుకుంటారు.

నేను కూడా రాయలసీమలో పుట్టినబిడ్డనే. ఎవడైనా నన్ను రాయలసీమ ద్రోహి అంటే వాళ్ల గుండెల్లో నిద్రపోతా. నేను చేసిన అభివృద్ధికి నువ్వు రంగులు వేసుకున్నావు. ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలబడే నువ్వా నన్ను ఎగతాళి చేసేది? విద్యార్థులు ఆలోచించాలి. ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

More Telugu News