Tollywood: నా గురువు అల్లు రామలింగయ్య మాట ఇప్పటికీ పాటిస్తున్నా: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం

  • ఏ హీరో వద్ద ఉంటే ఆ హీరో గురించే మాట్లాడమని చెప్పారు
  • అలా కాకుంటే.. ఇద్దరు కలిస్తే.. మనం ఔటవుతామన్నారు
  • ‘అల వైకుంఠపురములో’ చిత్రం థ్యాంక్స్ మీట్ లో వెల్లడి

తన గురువు అల్లురామలింగయ్య మాట ఇప్పటికీ పాటిస్తున్నానని హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చెప్పారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా తొలిరోజే కలెక్షన్లతో అదరగొట్టడంతో బ్లాక్ బస్టర్ గా రేటింగ్ కొట్టేస్తోంది.  ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘థ్యాంక్స్ మీట్’ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం తన ప్రసంగంతో ప్రేక్షకులను అదరగొట్టేశారు. ‘రాములో రాములా పాట హిట్ కావడానికి కారణం బన్నీ(అల్లు అర్జున్) నే అనుకుంటున్నారు. కాదు నేనే.  సినిమాలో నేను కనిపించే క్యారెక్టర్‌కు సంబంధించి  బ్యాక్ గ్రౌండ్‌లో జరిగిన విషయం చెప్పడానికి వచ్చాను’ అని  అన్నారు.

‘నాకు బైపాస్ సర్జరీ అయ్యాక పరామర్శించడానికి బన్నీ ఇంటికి వచ్చాడు. మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్. సర్జరీ తర్వాత మీరు చేస్తున్న మొదటి సినిమా నాదే అన్నాడు. ఏదో ఎంకరేజ్ చేయడం కోసం అంటున్నాడనుకున్నా. ఆ తర్వాత త్రివిక్రమ్ వచ్చారు. సర్ మనం కలుస్తున్నాం అని చెప్పి వెళ్లిపోయారు. సినిమా అయిపోయిందేమో ప్రమోషన్ కోసం అనుకున్నా. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని నాకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే.. ఓ మాట ఇచ్చాక దానిని నిలబెట్టుకోవాలని కష్టపడే అతి తక్కువ మంది వ్యక్తుల్లో బన్నీ, త్రివిక్రమ్ ఒకరు’  అని వారిని ప్రశంసించారు.

‘నా గురువుగారు అల్లు రామలింగయ్య ఎన్నో ఏళ్ల పాటు పరిశ్రమలో ఉన్నా కూడా ఒక్క రిమార్క్ కూడా లేని వ్యక్తి. ఆయన నాతో ఎప్పుడూ చెబుతూండేవారు. 'రేయ్, నువ్వు ఏ హీరో దగ్గరికి వెళితే ఆ హీరో గురించే మాట్లాడు. మరో హీరో గురించి మాట్లాడకు. ఎందుకంటే ఆ ఇద్దరు హీరోలు కలిస్తే మనం ఔటయిపోతాం’ అని చెప్పారు. అలాంటి వ్యక్తికి అల్లు అరవింద్ రూపంలో గొప్ప కొడుకు పుట్టాడన్నారు.

'ఇదంతా చెప్పటానికి కారణం.. మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ తన తండ్రి గురించి మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నాడు. అల్లు రామలింగయ్య గారు చనిపోయిన తర్వాత దాదాపు 18 ఏళ్ల పాటు అరవింద్ చాలా బాధ పడ్డారు. అతను మంచి కొడుకు కాబట్టే అతనికి బన్నీ రూపంలో మంచి కొడుకు పుట్టాడు' అంటూ బ్రహ్మానందం పేర్కొన్నారు.

More Telugu News