CPI Narayana: ఏపీలో మిలిటరీ పాలన కొనసాగుతోంది: సీపీఐ నారాయణ

  • మూడు ప్రాంతాల్లో జగన్ అలజడి సృష్టిస్తున్నారు
  • అమరావతి విషయంలో జగన్ మాట మార్చారు
  • విశాఖలో రాజధాని అంశానికి మేము వ్యతిరేకం

ఏపీలో ప్రభుత్వ పాలనపై సీపీఐ నారాయణ విమర్శలు చేశారు. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల్లో జగన్ అలజడి సృష్టిస్తున్నారని, ఏపీలో మిలిటరీ పాలన సాగుతోందని విమర్శించారు. నాడు ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతి ఏర్పాటుకు అంగీకరించిన జగన్ ఇప్పుడు మాటమార్చారని మండిపడ్డారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని సీపీఐ జాతీయ కమిటీ తీర్మానం చేసినట్టు చెప్పారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో రాజధాని ఉంటే ఇబ్బంది లేదు కానీ, విశాఖలో రాజధాని ఏర్పాటు అంశానికి మాత్రం తాము వ్యతిరేకమని మరోమారు తెలిపారు. కర్నూలు జిల్లా సీపీఐలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ఈరోజు భేటీ కావడంపై ఆయన స్పందిస్తూ, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవడం మంచిదేనని అన్నారు. అయితే, ఆర్థిక నిపుణులు, సాగునీటి నిపుణులు లేకుండా సమావేశాలేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే పనులు జగన్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎంఐఎంపై ఆయన ఆరోపణలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ కు ఎంఐఎం అనుకూలం అని, మజ్లిస్ పార్టీ కోరలు తీసిన పాము అనీ ఆయన వ్యాఖ్యానించారు.  

More Telugu News