budda venkanna: పృథ్వీకి భగవంతుడు ఏ శిక్ష విధించాడో చూశాం: బుద్ధా వెంకన్న

  • రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అన్న వారిని దేవుడే తప్పకుండా శిక్షిస్తాడు 
  • ఇటువంటి వారి అంతు చూడకుండా ప్రజలు కూడా వదలరు 
  • ప్రభుత్వాలు శాశ్వతం కాదు 
  • రాష్ట్రంలో మొదటిసారిగా సంక్రాంతి పండుగలను ప్రజలు చేసుకోవట్లేదు

అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న పృథ్వీకి భగవంతుడు ఏ శిక్ష విధించాడో చూశామంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అన్న వారిని దేవుడే తప్పకుండా శిక్షిస్తాడు. ఇటువంటి వారి అంతు చూడకుండా ప్రజలు కూడా వదలరు' అని వ్యాఖ్యానించారు.

'వైసీపీ అంతును మేము చూడాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆ పార్టీ నేతల అంతు చూస్తారు. డీజీపీ గారికి మేము ఇప్పటికే ఓ విషయం చెప్పాము. ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. మేము అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వంలో ఈ పోలీసు అధికారులు చేసిన తప్పిదాలన్నిటినీ వెలికి తీసి తగిన శిక్ష విధిస్తాం' అని బుద్ధా వెంకన్న చెప్పారు.

'ప్రజలకు అమరావతి రాజధాని కావాలి. పండుగ పూట జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఇంట్లోనే సంక్రాంతి జరుపుకుంటున్నారు. అంతేగానీ, రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లల్లో చేసుకోవట్లేదు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి పండుగలను ప్రజలు చేసుకోవట్లేదు' అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.

More Telugu News