SarileruNeekevvaru: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో... 'బాహుబలి'ని బీట్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు'!

  • తొలి రోజున రూ. 32 కోట్లకు పైగా షేర్
  • మహేశ్ బాబు చిత్రాల్లో తొలిరోజు కలెక్షన్ల రికార్డు
  • బాక్సాఫీసు వద్ద దూసుకెళుతున్న సినిమా  

తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన 'బాహుబలి' తొలి రోజు కలెక్షన్లను టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' అధిగమించింది. ఎక్కడో తెలుసా? హైదరాబాద్ లో సినిమా థియేటర్లు అత్యధికంగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో... ఈ సంక్రాంతి సీజన్ లో 11వ తేదీన మహేశ్ సినిమా విడుదల కాగా, తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 32 కోట్లకు పైగా షేర్ వసూలైంది. మహేశ్ బాబు చిత్రాల్లో తొలి రోజు కలెక్షన్లలో ఇదే అత్యధికం.

ఎటు చూసినా సినిమా హాళ్లతో, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ కోలాహలంగా ఉండే సెంటర్ ఇది. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ చౌరస్తాకు నలువైపులా దాదాపు 12 థియేటర్లు ఉండేవి. 70వ దశకం నుంచి 2010 వరకూ విడుదలైన సినిమాల్లో హిట్ అయిన చిత్రాలన్నీ ఏదో ఒక థియేటర్ లో శతదినోత్సవం జరుపుకున్నవే. దేవి, సుదర్శన్ 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎం, ఓడియన్, ఓడియన్ 70 ఎంఎం, ఓడియన్ డీలక్స్, సంధ్య 70 ఎంఎం, సంధ్య 35 ఎంఎం, శ్రీ మయూరి, సప్తగిరి, సాయిరాజా... ఇలా అరకిలోమీటర్ పరిధిలోనే ఎన్నో హాళ్లుండేవి.

ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని థియేటర్ల స్థానంలో మాల్స్ నిర్మాణం జరుగుతోంది. అయినా, ఇక్కడికి వచ్చి సినిమాను చూసి వెళ్లాలని భావించే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. అందుకు అనుగుణంగానే, ఏ చిన్న, పెద్ద హీరో చిత్రం విడుదల అయినా, ఇక్కడి ఒక్క థియేటర్ లో అయినా విడుదల అవుతుంది.

ఇక తాజాగా, ఈ చౌరస్తాలో ఉన్న 5 థియేటర్లలో 'సరిలేరు నీకెవ్వరు' విడుదల అయింది. తొలి రోజు అన్ని థియేటర్లలో 5 షోల చొప్పున ప్రదర్శించగా, అన్నీ హౌస్ ఫుల్! 'బాహుబలి' విడుదల సమయంలో వచ్చిన కలెక్షన్లను 'సరిలేరు నీకెవ్వరు' అధిగమించిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. కాగా, 'బాహుబలి' విడుదల సమయంతో పోలిస్తే, ఇప్పుడు టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయన్నది గమనార్హం.

More Telugu News