Tehran: ఇరాన్ లోని బ్రిటన్ రాయబారి అరెస్ట్... మండిపడ్డ అగ్రదేశాలు!

  • టెహ్రాన్ వర్శిటీలో సంతాప కార్యక్రమం
  • పాల్గొన్న బ్రిటన్ రాయబారి రాబ్ మెకెయిర్
  • ఒత్తిడి రావడంతో విడుదల చేసిన ఇరాన్

ఉక్రెయిన్ విమాన ప్రమాద మృతులకు మద్దతుగా టెహ్రాన్ లోని ఆమిర్ కబీర్ యూనివర్శిటీలో జరిగిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ రాయబారి రాబ్ మెకెయిర్ ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై బ్రిటన్, అమెరికా సహా పలు దేశాలు మండిపడ్డాయి. దీంతో కాసేపటికి ఆయన్ను వదిలేశారు. విమానం కూల్చివేతపై జరుగుతున్న ఆందోళనలను సైన్యం అణచివేయాలని చూస్తోందని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

"శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై మరో ఊచకోత జరగకూడదు. ఇంటర్ నెట్ పై ఆంక్షలను సహించబోము. ఇరాన్‌ ప్రజలారా... మీకు నా సహకారం కొనసాగుతుంది" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, ఆమిర్ కబీర్ వర్శిటీలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని, విద్యార్థులు జనరల్ సులేమానీ పోస్టర్లను చించి వేశారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆందోళనలు తలెత్తే అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రాంతాల్లో బలగాలను పెంచింది.

More Telugu News