SVBC: నాపై ఆరోపణలను ఖండిస్తున్నా.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశా : పృథ్వీరాజ్

  • నాపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నా
  • నాకు మద్యం తాగే అలవాటు లేదు
  • కావాలంటే, నా బ్లడ్ శాంపిల్స్  పరీక్షించుకోవాలి

ఆడిమో టేపుల వ్యవహారంపై ఆరోపణల నేపథ్యంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పదవికి రాజీనామా చేయమని వైసీపీ అధిష్ఠానం తనను ఆదేశించలేదని, స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని, మెయిల్ లో పంపించానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని టీటీడీని తానే స్వయంగా కోరానని, అదే విధంగా, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనపై విచారణ తేలిన తర్వాతే ఎస్వీబీసీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.

పద్మావతి గెస్ట్ హౌస్ లో తాను మద్యం సేవించినట్టు, ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్య సంభాషణ చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నానని అన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని, తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించుకోవాలని తనపై ఆరోపణలు చేసిన వారికి సవాల్ విసిరారు.

ఈ నాలుగు నెలలు ఎన్ని కుట్రలు, తనను అసభ్యంగా దూషిస్తూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయని పృథ్వీరాజ్ అన్నారు. రోజూ తనను దూషిస్తూ ఫోన్ కాల్స్ వచ్చేవని, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. సినీ నిర్మాత అశ్వనీదత్ ను తాను ఎంతో గౌరవిస్తానని, అలాంటి వ్యక్తి, నిన్న తనను దూషిస్తూ మాట్లాడటం ఓ వీడియోలో చూశానని, ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. కార్పొరేట్ ముసుగులో ఉన్న రైతులను తాను విమర్శించానే తప్ప ఓ సామాజిక వర్గాన్ని తానేమీ లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయలేదని, నిజమైన రైతులను తానేమీ విమర్శించడం లేదని స్పష్టం చేశారు.

తాను నమ్ముకున్న దేవుడి సాక్షిగా చెబుతున్నానని తనపై ఆరోపణలు చేసిన వారెవ్వరూ బాగుపడరంటూ ఉద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన పదవికి రాజీనామా చేశాను కనుక, ఇక కడిగి పారేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి పృథ్వీరాజ్ ప్రస్తావించారు. ఎస్వీబీసీ ఛానెల్ కు చెందిన మేకప్ మెన్ వెంకటరెడ్డి అనే అతని ప్రవర్తనలో తేడా ఉందని చెప్పి మూడు నెలల పాటు హైదరాబాద్ ఆఫీసులో పనిచేయమని చెప్పానని అన్నారు. అతను యూనియన్ కు చెందిన వ్యక్తి అని తనకు తెలియదని, ఈ విషయాన్ని వరదరాజులు అనే ఆయనకు చెప్పాడని వివరించారు.

More Telugu News