పవన్, చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెలియని జనసేన నేతలు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు: ద్వారంపూడి

12-01-2020 Sun 15:23
  • చంద్రబాబు, పవన్ లపై ద్వారంపూడి వ్యాఖ్యలు
  • ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఉద్రిక్తత
  • స్పందించిన ద్వారంపూడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. కాకినాడలో ఆయన నివాసం వద్ద వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లదాడికి యత్నించారు. దీనిపై ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కుమ్మక్కయ్యారన్న సంగతి తెలియని జనసేన నాయకులు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో పవన్ ఒక్క టీడీపీ నేతను కూడా టార్గెట్ చేయలేదని, వైసీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, కాపు ఉద్యమం సాగుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబంపై లాఠీచార్జి జరిగితే పవన్ ఖండించలేదని, జనసేన పార్టీ నుంచి సైతం ఎలాంటి స్పందన లేదని అన్నారు. చంద్రబాబు కాపు ఉద్యమానికి వ్యతిరేకి కావడంతో పవన్ మౌనం వహించాడని విమర్శించారు.