'సైరా' చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న చిరంజీవి

12-01-2020 Sun 14:27
  • జీ సినిమా అవార్డుల ప్రదానోత్సవం
  • ఉత్తమనటిగా సమంత
  • ట్విట్టర్ స్టార్ గా మహేశ్ బాబు
  • ఇస్మార్ట్ శంకర్ కు అవార్డుల పంట

కొంతకాలంగా టీవీ చానళ్లు ఇచ్చే అవార్డులకు ప్రాముఖ్యత పెరిగింది. తాజాగా జీ సినిమా అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈసారి సైరా నరసింహారెడ్డి చిత్రానికి గాను మెగాస్టార్ చిరంజీవి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి పురస్కారం సమంతకు దక్కింది. మజిలీ, ఓ బేబీ చిత్రాల్లో కనబర్చిన నటన సమంతను ఉత్తమనటిగా నిలిపింది.

ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం భారీగా అవార్డులు కైవసం చేసుకుంది. బెస్ట్ సెన్సేషనల్ మూవీ అవార్డు దక్కించుకుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ బెస్ట్ సెన్సేషనల్ డైరక్టర్ గా, చార్మీ బెస్ట్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ గా, రామ్ బెస్ట్ సెన్సేషనల్ హీరోగా, బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా మణిశర్మ (ఇస్మార్ట్ శంకర్) అవార్డులు అందుకున్నారు. ఇక, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అందుకే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ట్విట్టర్ స్టార్ అవార్డు మహేశ్ బాబు సొంతం చేసుకున్నారు.