విశాఖను అభివృద్ధి చేయాలనుకుంటే ‘పోలవరం’ పనులు ఎందుకు ఆపారు?: యనమల రామకృష్ణుడు

12-01-2020 Sun 13:52
  • దక్షిణాఫ్రికా దేశాన్ని పోలికగా తీసుకున్నారు!
  • సీఎం జగన్ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమౌతోంది
  • ప్రస్తుతం ఏపీకి అప్పు కూడా పుట్టని పరిస్థితి

ప్రపంచంలోని ఐదు ఉత్తమదేశాల్లో సింగపూర్ ఒకటి అని, అందుకే, దానిని ఆదర్శంగా తీసుకుని రాజధాని అమరావతిని నిర్మించాలనుకున్న విషయాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గుర్తుచేసుకున్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం మాత్రం దక్షిణాఫ్రికా దేశాన్ని పోలికగా తీసుకుంటూన్నారని, దీనిని బట్టే సీఎం జగన్ మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతున్న జగన్, మరో చోటకు వెళ్లి రాజధాని నిర్మించాలన్న ఆలోచన కరెక్టు కాదని అన్నారు. విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖకు జగన్ చేసింది లాభం కాదు, నష్టమని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీకి అప్పు కూడా పుట్టని పరిస్థితి అని, వీళ్ల మొఖాలు చూసి ఎవరూ ముందుకు రావడం లేదంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.