కోల్ కతాలో ప్రధానికి నిరసనల సెగ : సీఏఏ వ్యతిరేకుల ఆందోళన

12-01-2020 Sun 12:58
  • వివేకానందుని జయంతి ఉత్సవాలకు వెళ్లిన మోదీ 
  • కాంగ్రెస్, వామపక్ష విద్యార్థులు రెండో రోజు ఆందోళన 
  • ఎస్‌ప్లనేడ్ ప్రాంతంలో రాత్రంతా బైఠాయింపు

స్వామి వివేకానందుని 150 జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు కోల్ కతాకు వెళ్లిన ప్రధాని మోదీకి నిరసనల సెగ తాకుతోంది. ఇటీవల పార్లమెంటు అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రెండు రోజుల పర్యటన కోసం నిన్ననే మోదీ కోల్ కతా చేరుకున్నారు. తొలిరోజే మోదీకి నిరసనలు ఎదురయ్యాయి. బేలూరు మఠంలో రాత్రికి మోదీ బస చేశారు. దీంతో విద్యార్థులంతా ఎస్‌ప్లనేడ్ ప్రాంతంలో రాత్రంతా బైఠాయించి తమ నిరసన తెలిపారు.

కోల్ కతాను మోదీ విడిచి పెట్టే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. చెప్పినట్టే ఈరోజు ఉదయం బేలూరు మఠంలో ప్రభాత ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం కోల్ కతా పోర్టు ట్రస్టు వార్షికోత్సవంలో పాల్గొనేందుకు నేతాజీ ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు మోదీకి వ్యతిరేకంగా నల్లజెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.