తప్పు ఎవరిది?... హైదరాబాద్ మోడల్ పెట్టిన అత్యాచారం కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులు!

12-01-2020 Sun 12:33
  • తొలుత ఇచ్చిన ఫిర్యాదును మార్చిన మోడల్
  • మత్తులో రాసిచ్చిన ఫిర్యాదుతో సంబంధం లేదని వెల్లడి
  • డబ్బు కోసం బెదిరిస్తోందని ఆరోపణలు

తానుంటున్న హాస్టల్ యజమాని కుమారుడు, తాను ప్రేమించుకున్నామని, శారీరకంగా దగ్గరయ్యామని, ఇప్పుడు పెళ్లాడేందుకు నిరాకరిస్తున్నాడని తొలుత పోలీసులను ఆశ్రయించిన హైదరాబాద్ మోడల్ (21), ఆపై తాను అత్యాచారానికి గురయ్యానని ఫిర్యాదును మార్చడంతో పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. సదరు మోడల్ కూడా తమను మోసం చేసిందని యువకుడి తల్లిదండ్రులు ఆరోపించడంతో తప్పెవరిదో తేల్చే పనిలో పడ్డారు.

బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హాస్టల్ లో ఉన్న సమయంలో యజమాని కుమారుడితో కలిసి మోడల్ కొన్ని టిక్ టాక్ వీడియోలు చేసింది. వీరికి నిఖిల్ రెడ్డి అనే కామన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తనకు మత్తుమందిచ్చి, అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీశారని ఆమె ఆరోపిస్తోంది.

తొలుత పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆమె, ఆ సమయంలో మత్తులో ఉండి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదు చేశానని, దానితో తనకు సబంధం లేదని చెప్పి, మరో ఫిర్యాదును అందించింది. దీంతో ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపిన పోలీసులు, సెల్ ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు.

ఇదిలావుండగా, తన కుమారుడు మైనర్ అని, అతనిపై వలేసిన మోడల్, ఇప్పుడు రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తోందని హాస్టల్ యజమాని ఆరోపిస్తున్నారు. ఆమె తన కుమారుడితో వివాహానికి సిద్ధపడగా, మేజర్ అయిన తరువాత పెళ్లి చేస్తామన్నామని వారు అంటున్నారు. డబ్బు కోసం ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. ఈ కేసులో ఆధారాలను సేకరిస్తున్నామని, పూర్తి స్థాయి దర్యాఫ్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.