కాసేపట్లో నరసరావుపేటకు చంద్రబాబు.. ఉద్రిక్తత

12-01-2020 Sun 12:30
  • టీడీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ 
  • అనుమతి లేదన్న పోలీసులు
  • పార్టీ కార్యాలయం వద్దకు భారీగా వచ్చిన పోలీసులు 

గుంటూరు జిల్లా, నరసరావుపేటలో కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయం నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టబోయారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీకి అనుమతి లేదని పార్టీ కార్యాలయానికి పోలీసులు భారీగా వచ్చారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుందని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.