Chandrababu: శ్రీలక్ష్మి కడుపులో ఎడమవైపు తొక్కారు: చంద్రబాబు ఆగ్రహం

  • ఇది అమానుషం
  • ఆడబిడ్డల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా?
  • పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు
  • సీఎం స్పందించట్లేదు.. ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? 

అమరావతి ఆందోళనల్లో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శ్రీలక్ష్మి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. తమ తండ్రిని పోలీసులు తీసుకెళ్తున్నారని శ్రీలక్ష్మి అడ్డుకోబోయారని చెప్పారు. దీంతో ఆమెపై పోలీసులు దాడి చేశారని అన్నారు.

'శ్రీలక్ష్మి కడుపులో ఎడమవైపు తొక్కారు. ఇది అమానుషం.. ఆడబిడ్డల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మహిళల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. సీఎం జగన్ స్పందించట్లేదు. ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? ప్రజలను బాధ పెట్టడానికా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

'ఈ సీఎం మూల్యం చెల్లించుకుంటాడు. 144 సెక్షన్ పెట్టాలంటే కొన్ని నిబంధనలను ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఎక్కడ చూసినా అమరావతిలో 144 సెక్షన్ విధిస్తున్నారు. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేశారు. యుద్ధ వాతావరణం సృష్టించారు.. తీవ్రంగా ఖండిస్తున్నాం' అని చంద్రబాబు తెలిపారు. ప్రజల దృష్టిలో పోలీసులు దోషులు కావద్దని అన్నారు. రాష్ట్రానికి జాతీయ మహిళా కమిషన్ వచ్చింది. వారు శ్రీలక్ష్మి పరిస్థితిని చూడాలని అన్నారు.

More Telugu News