బేలూరు మఠం ప్రభాత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

12-01-2020 Sun 11:12
  • తనకిదో తీర్థయాత్ర అనుభవం అని వ్యాఖ్య 
  • రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం ఇది 
  • పరమహంసకు నివాళులర్పించిన ప్రధాని

హౌరా జిల్లాలోని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేలూరు మఠాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. మఠంలోనే రాత్రి బసచేసిన మోదీ ఈరోజు ఉదయం అక్కడ జరిగిన ప్రభాత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణ పరమహంసకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ కోల్ కతా విచ్చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కోల్ కతాలో పర్యటించనున్న మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తనకు ఇది తీర్థయాత్రలాంటిదని వ్యాఖ్యానించారు. మఠంలో బస చేసేందుకు అనుమతించిన మఠం అధ్యక్షునికి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. 

వివేకానంద స్వామీజీ ఈ రోజు మన మధ్య లేకున్నా రామకృష్ణ మఠం ద్వారా ఆయన సేవలు, చూపించిన మార్గం అనుసరణీయమన్నారు. 2015 మే 10న తొలిసారి బేలూరు మఠాన్ని మోదీ సందర్శించారు. ఆ సమయంలో స్వామీ ఆత్మస్థానందజీ ఆశీస్సులు తీసుకున్నారు.