రిపబ్లిక్ డే వేదిక విశాఖ : సాగర తీరంలో గణతంత్ర దినోత్సవం

12-01-2020 Sun 11:08
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  • ఆర్కే బీచ్ లో నిర్వహణకు ఏర్పాట్లు 
  • రాజధానిలో ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను విశాఖ వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని రామకృష్ణ బీచ్ లో వేడుకలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అమరావతి, మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల, ప్రతికూల ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మాంది. నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ విజయవాడేతర కేంద్రాల్లో రిపబ్లిక్ డే దినోత్సవం నిర్వహించిన సందర్భాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల మార్పుపై చర్చ సాగుతోంది.

తొలుత విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ అమరావతిలో రైతుల ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నందున ఈ పరిస్థితుల్లో అక్కడ వేడుకలు నిర్వహించడం మంచిది కాదన్న ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొందరు భావిస్తున్నారు.

విశాఖకు రాజధాని తరలి రానుందన్న ముందస్తు సమాచారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది నిజమన్నది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.