పొలిటికల్ గేమ్‌ ఆడుతున్నారు: ప్రతిపక్షాలపై మోదీ మండిపాటు

12-01-2020 Sun 11:02
  • నేను మరోసారి చెబుతున్నాను
  • పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ఎవరి పౌరసత్వాన్నీ తొలగించదు
  • ఈ చట్టం పౌరసత్వం ఇస్తుంది 
  • సీఏఏ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్ష పార్టీల నేతలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్‌ మఠం వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ... 'నేను మరోసారి చెబుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ఎవరి పౌరసత్వాన్నీ తొలగించదు. ఈ చట్టం పౌరసత్వం ఇస్తుంది. పాకిస్థాన్‌లోని మైనార్టీలకు భారత్‌లో పౌరసత్వం ఇవ్వాలని దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీతో పాటు చాలా మంది గొప్ప నేతలు భావించారు' అని తెలిపారు.

'ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ, రాజకీయ క్రీడలు ఆడుతోన్న కొందరు మాత్రం సీఏఏను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తున్నారు. సీఏఏ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు' అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య భారత సంస్కృతి, గుర్తింపులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.