Amaravati: ధర్నా చౌక్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్న రైతులు.. అడ్డుకుంటున్న పోలీసులు.. ఉద్రిక్తత!

  • తుళ్లూరులోని పాలకోటయ్య సత్రం ప్రాంగణం వద్ద దీక్ష
  • నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులు
  • ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని మైకుల ద్వారా పోలీసుల ప్రచారం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చొద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు తుళ్లూరులోని పాలకోటయ్య సత్రం ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌లో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ధర్నా చౌక్ వద్ద మోహరించిన వందలాదిమంది పోలీసులు రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. రైతులు టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తమను అడ్డుకుంటే రోడ్డుపైనే దీక్షలకు దిగుతామని పోలీసులతో రైతులు వాగ్వివాదానికి దిగారు.

నిరసన తెలిపేందుకు వస్తున్న తమను పోలీసులు భయపెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రైతులు నినాదాలు చేస్తున్నారు. అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని కాబట్టి ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని మైకుల ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మందడంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు.

More Telugu News