‘ఫ్రీలోడర్స్’ అంటూ ఢిల్లీ ప్రజలను అవమానిస్తారా?: బీజేపీపై మనీశ్ సిసోడియా ఫైర్

12-01-2020 Sun 09:43
  • లబ్ధిదారులను ఫ్రీలోడర్స్ అంటారా?
  • ఇదేనా మీ అజెండా
  • బీజేపీకి ఓటేస్తే అది ఉచిత పథకాలకు వ్యతిరేకంగా వేసినట్టే

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘ఫ్రీలోడర్స్’ అంటూ ఢిల్లీ ప్రజలను అవమానిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనుక బీజేపీకి ఓటేస్తే అది ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యానికి వ్యతిరేకంగా వేసినట్టేనని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న ప్రజలను ఫ్రీలోడర్స్ అంటూ బీజేపీ అవమానిస్తోందని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని విమర్శించారు. నిజానికి అది వారి అజెండా కావొచ్చన్నారు. ప్రజలకు సేవలు చేయడం ప్రభుత్వం బాధ్యతని, దానిని సక్రమంగా నెరవేర్చేందుకే తామిక్కడ ఉన్నామని సిసోడియా చెప్పుకొచ్చారు.