యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్.. బుద్ధి చెప్పిన వైనం!

12-01-2020 Sun 09:23
  • హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఘటన
  • చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్
  • స్తంభానికి కట్టేసి చితక్కొట్టిన స్థానికులు, ఉద్యోగులు

తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌కు తోటి ఉద్యోగులు, స్థానికులతో కలిసి యువతి బుద్ధి చెప్పింది. హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన యువతి (21) బంజారాహిల్స్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తోంది. ఇటీవల ఆమె ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ ఆటోడ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. నిన్న ఉదయం ఆమె ఆఫీసుకు వెళ్తుండగా గమనించిన ఆటో డ్రైవర్ మరోమారు రెచ్చిపోయాడు. ఆమె చేయి పట్టుకున్నాడు.

బలవంతంగా చేయి విడిపించుకున్న బాధిత యువతి.. ఆఫీసుకు వెళ్లి తోటి ఉద్యోగులకు విషయం చెప్పింది. అందరూ కలిసి ఆటో వద్దకు చేరుకున్నారు. ఆటోలో కూర్చుని మద్యం తాగుతున్న అతడు వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

తనను వేధిస్తున్న ఆటో డ్రైవర్‌ చెంపను అందరూ చూస్తుండగా బాధిత యువతి ఛెళ్లుమనిపించింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ఫిలింనగర్ సైదప్ప బస్తీకి చెందిన నర్సింహ (29)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.