కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు

12-01-2020 Sun 08:37
  • పవన్‌పై రాయలేని భాషలో విరుచుకుపడిన ద్వారంపూడి
  • ప్యాకేజీ స్టారంటూ ఎద్దేవా
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగళగిరి జనసేన నేతలు

పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై మంగళగిరి జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్‌పై  ఆయన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు ఆరోపించారు. ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలని కోరారు.

రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనపై ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘోరమైన బూతులతో విరుచుకుపడ్డారు. పవన్ ఒక ప్యాకేజీ స్టారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే ఆయన కూడా ఒక నాయకుడేనా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. రాయలేని భాషలో బూతులు అందుకున్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.