టర్కీలో ఘోర పడవ ప్రమాదం.. 11 మంది వలసదారుల మృతి

12-01-2020 Sun 08:18
  • 19 మంది వలసదారులతో వెళ్తున్న పడవ
  • గంటల్లోనే ఇది రెండో ఘటన
  • మృతుల్లో 8 మంది చిన్నారులు

టర్కీలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 19 మంది ఉన్నారు. పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో ఈ ఘటన జరిగినట్టు టర్కీ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల జాతీయత ఏంటన్నది తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.  గ్రీక్ ద్వీపంలోని అయిగీన్ ప్రాంతంలో పడవ మునిగి 12 మంది మృతి చెందిన కొన్ని గంటల్లోనే తాజా ఘటన జరగడం గమనార్హం.