అమ్మాయిని ఏడిపించి, పబ్బుపై దాడి చేసి... హైదరాబాద్ లో తాగుబోతుల వీరంగం!

12-01-2020 Sun 08:01
  • బేగంపేటలోని పబ్ లో ఘటన
  • యజమానిపైనా దాడి
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

మందు కొట్టిన కొంతమంది, ఓ అమ్మాయిని ఏడిపించడంతో పాటు, పబ్బుపై దాడి చేసి, అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేయడంతో పాటు, సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన దాని యజమానిపైనా దాడి చేశారు. నిన్న రాత్రి బేగంపేటలోని ఓ పబ్బులో ఈ ఘటన జరిగింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులోని వివరాల మేరకు, పబ్బుకు వచ్చిన కొందరు యువకులు పూటుగా తాగారు.

అదే పబ్ కు ఒంటరిగా వచ్చిన యువతిని వేధించారు. ఆమెను వెంబడిస్తూ నానాయాగీ చేశారు. దీనిపై ఆమె పబ్ మేనేజర్ కు ఫిర్యాదు చేయగా, యువకులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయబోగా, అతనిపైనా దాడి చేశారు. పోలీసులు వచ్చి దాడికి పాల్పడిన యువకుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఇదే తరహా ఘటన ఎల్బీనగర్ లోనూ జరిగింది. నాగోల్ ప్రాంతంలోని ఓ హోటల్ కు వచ్చిన కొందరు గొడవకు దిగి, హోటల్ యజమాని బైక్ ను గ్రానైట్ రాయితో ధ్వంసం చేశారు. దీనిపై అతను ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.