చైనాలోని జియాంగ్‌సూ రాష్ట్ర జనాభా 8 కోట్లు.. పేదవారు మాత్రం 17 మందేనట!

12-01-2020 Sun 07:51
  • ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న జియాంగ్‌సూ నివేదిక
  • ఆ 17 మంది ఆరు కుటుంబాల వారేనని వెల్లడి
  • గత నాలుగేళ్లలో 2.54 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్న ప్రభుత్వం

చైనాలోని సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన జియాంగ్‌సూలో 8 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ రాష్ట్రం తాజాగా విడుదల చేసిన పేదరిక గణాంకాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తం 8 కోట్ల మంది జనాభాలో కేవలం 17 మంది మాత్రమే పేదలు ఉన్నారని నివేదిక పేర్కొంది. ఈ 17 మందీ ప్రభుత్వం నిర్దేశించిన 863 డాలర్లు (6 వేల యువాన్ల) వార్షిక ఆదాయాన్ని అందుకోలేకపోతున్నారని అధికారులు తెలిపారు. నివేదికలో పేర్కొన్న ఆ 17 మంది ఆరు కుటుంబాల వారేనని వివరించారు. గత నాలుగేళ్లలో 2.54 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, జియాంగ్‌సూ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చూసి ప్రపంచం విస్తుపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే విమర్శల జడివాన కురుస్తోంది. అదే రాష్ట్రానికి చెందిన పలువురు తామింకా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. 1990 తర్వాత పెరిగిన ఆర్థిక అసమానతల్లో చైనా ముందుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి గణాంకాలు విడుదల కావడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.