నటి కల్యాణిది హత్యే.. ఈఎస్ఐ శ్మశాన వాటికలో సినీ ఆర్టిస్టుల ధర్నా

12-01-2020 Sun 07:24
  • ఆమె శరీరంపై గాయాలున్నాయని ఆరోపణ
  • దోషులను శిక్షించేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వబోమన్న ఆర్టిస్టులు
  • పోలీసుల హామీతో ఆందోళన విరమణ

హైదరాబాద్, ఈఎస్ఐ శ్మశాన వాటికలో నిన్న రాత్రి టీవీ, సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు చెందిన కళాకారులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు పాల్పడిన నటి కల్యాణి మృతిపై తమకు అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టి.కల్యాణి (30) తాను ఉండే బల్కంపేటలో ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హోంగార్డు అయిన ఆమె భర్త రాంప్రసాద్‌కు అప్పగించారు. ఆయన నిన్న రాత్రి ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

విషయం తెలుసుకున్న సహ కళాకారులు 30 మంది శ్మశాన వాటికకు చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయని అన్నారు. కల్యాణి శరీరంపై గాయాలున్నాయని, అది తప్పకుండా హత్యేనని ఆరోపించారు. దోషులను శిక్షించేంత వరకు అంత్యక్రియలు జరగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్మశానానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.