అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి హైదరాబాద్ రాజాచారి

12-01-2020 Sun 07:02
  • నాసా ప్రకటనతో 18 వేల మంది దరఖాస్తు
  • మిగిలిన 11 మందిలో రాజాచారి ఒకరు
  • రాజాచారి తండ్రి శ్రీనివాసాచారిది హైదరాబాద్

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనల కోసం ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన 11 మందిలో హైదరాబాద్ మూలాలున్న వ్యోమగామి రాజాచారి కూడా ఉన్నారు. 2017లో నాసా ప్రకటనతో  మొత్తం 18 వేల మంది దరఖాస్తు చేసుకోగా 11 మందిని నాసా ఎంపిక చేసింది. అత్యంత కఠిన శిక్షణ ప్రక్రియలను తట్టుకుని చివరి వరకు నిలబడిన వారిలో రాజాచారి కూడా ఉన్నారు. చంద్రుడు, అంగారకుడు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలకు చేపట్టబోయే యాత్రల్లో ఎంపికైన వారు భాగస్వామ్యం కానున్నారు. ప్రాథమిక శిక్షణ అనంతరం శుక్రవారం వీరికి లాంఛనంగా ఓ వెండి పిన్‌ను అందించారు. తొలి అంతరిక్ష యాత్ర పూర్తయ్యాక బంగారు పిన్‌ను అందిస్తారు.

రాజాచారి పూర్తిపేరు రాజా జాన్ ఉర్పుటూర్ చారి. తల్లిదండ్రులు పెగ్గీచారి, శ్రీనివాసాచారి. 1973లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి అమెరికాకు వలస వెళ్లిన శ్రీనివాసాచారి అక్కడ పీజీ పూర్తిచేశారు. అనంతరం వ్యవసాయ పరికరాలు తయారు చేసే సంస్థలో ఇంజినీర్‌గా పనిచేశారు. 2010లో ఆయన మృతి చెందారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన రాజాచారి అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో  యుద్ధ విమాన పైలట్‌గా పనిచేశారు.