Naravane: ఆదేశాలు ఇస్తే పీఓకేను తిరిగి తెస్తాం: ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

  • పీఓకే భారత్ లో అంతర్భాగమే
  • సైన్యమంతా రాజ్యాంగానికి విధేయులే
  • పార్లమెంట్ ఓకే చెబితే పీఓకేపైకి వెళ్తామన్న నరవాణే

భారత పార్లమెంట్ నుంచి ఆదేశాలు అందితే, ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉన్న భారత భూ భాగాన్ని తిరిగి వెనక్కు తీసుకుని వచ్చేందుకు చర్యలు మొదలు పెడతామని ఆర్మీ చీఫ్ నరవాణే వ్యాఖ్యానించారు. ఆర్మీడే సందర్భంగా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పీఓకే భారత్ లో అంతర్భాగమని పార్లమెంట్ ఎప్పుడో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఇండియాకు 13 లక్షల మందితో కూడిన ఆర్మీ ఉందని, సైనికులంతా రాజ్యాంగానికి విధేయులేనని నరవాణే అన్నారు.

త్రివిధ దళాలను సమన్వయ పరిచేలా ఏర్పాటు చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం చాలా గొప్ప విషయమని, సీడీసీకి ఆర్మీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీలా భారత సైన్యం దొంగదెబ్బతీయబోదని, నైతిక విలువలకు కట్టుబడివుంటుందని అన్నారు. సియాచిన్ ప్రాంతంపై అనునిత్యమూ ఓ కన్నేసి ఉంచాలని అభిప్రాయపడిన నరావణే, పాక్, చైనాల మధ్య కూడా ఈ ప్రాంతం కారణంగా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News