రాజధాని కూడా కట్టుకోలేని అసమర్థులమని తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారు: చంద్రబాబునాయుడు

11-01-2020 Sat 22:00
  • రాజధానిని ఎందుకు మార్చాలనుకుంటున్నారు?
  • విశాఖలో భూములు కొట్టేసేందుకేగా?
  • ఏపీ నాశనం కాకుండా మనం ప్రయత్నించాలి

మన రాజధానిగా అమరావతే ఉండేలా ఆశీర్వదించమని శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన ర్యాలీ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అమరావతి నుంచి రాజధానిని ఎందుకు మార్చాలనుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్టణంలో భూములు కొట్టేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, అందుకే, ఈ లేనిపోని ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో పరిపాలనకు కావాల్సిన భవనాలన్నీ ఉన్నాయని మరోమారు స్పష్టం చేశారు.

విశాఖను రాజధానిగా కనుక ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రజలకు చాలా దూరమవుతుందని, కుప్పం నుంచి విశాఖకు వెళ్లాలంటే 950 కిలోమీటర్ల దూరమని అన్నారు. ఈ సీఎంకు చేతనైంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదు విధ్వంసం చేయడమే అంటూ మండిపడ్డారు. ఏపీ ప్రజలు రాజధాని కూడా కట్టుకోలేని అసమర్థులంటూ మన పక్క రాష్ట్రమైన తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారని, ఏపీ నాశనం కాకుండా మనమంంతా ప్రయత్నించాలని పిలుపు నిచ్చారు.