Gaddam Vinod: మళ్లీ కాంగ్రెస్ లోకి.. తెలంగాణ నేత గడ్డం వినోద్!

  • కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ కుంతియా సమక్షంలో పార్టీ తీర్థం
  • 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది  
  • కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది  

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. తొలుత కాంగ్రెస్ లో ఉన్న వినోద్ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2013లో టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత ఏడాదిలో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు.  2016లో మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లారు. అనంతరం  అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చెన్నూరులో పోటీ చేసి ఓటమి పొందిన విషయం తెలిసిందే. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వినోద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ..‘ గతంలో కాంగ్రెస్ ను వీడాను అది అపరిపక్వ నిర్ణయం. తిరిగి సొంతగూటికి చేరడం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. కాంగ్రెస్ మా సొంత పార్టీ. మా నాన్న వెంకటస్వామి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా. కొన్ని కారణాలతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశా. నా సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన ఆలోచన వేరు నా ఆలోచన వేరు’ అని వినోద్ అన్నారు.

More Telugu News