కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు

11-01-2020 Sat 19:16
  • కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
  • తెలంగాణను ఇస్తాంబుల్, డల్లాస్ గా చేశారా?
  • యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నారు

ఎన్నికల హామీలను టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణను ఇస్తాంబుల్, డల్లాస్ గా చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో కనీస వసతులు లేవని, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎంఐంఎంకు వేసినట్టేనన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా ఆ పార్టీ వెళ్లి కలిసేది టీఆర్ఎస్ లోనే అని విమర్శించిన లక్ష్మణ్, త్వరలోనే గాంధీభవన్ కు ‘టూలెట్’ బోర్డు పెడతారని సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఆయన మండిపడ్డారు. యువతను ఆయన రెచ్చగొడుతున్నారని, చట్టాలకు మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు.