రాజధానిపై టీడీపీ, వైసీపీలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ

11-01-2020 Sat 18:41
  • రాజధాని అంశం రైతుల సమస్య కాదు
  • ఐదు కోట్ల మంది అభివృద్ధితో ముడిపడిన అంశం
  • అప్పటి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను అమలు చేయలేదు
  • పరిపాలన వికేంద్రీకరణ పేర రాజధాని తరలిస్తారా?

అమరావతి రాజధానిపై టీడీపీ, వైసీపీలు రెండూ కుట్ర పూరిత వైఖరిని అవలంబిస్తున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ రోజు జరిపిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

భేటీ అనంతరం కన్నా మీడియాకు వివరాలను వెల్లడిస్తూ.. తీర్మానాన్ని చదివి వినిపించారు. 2015లో అసెంబ్లీలో అమరావతిపై నిర్ణయం తీసుకునే సమయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ సహా బయటనుంచి కాంగ్రెస్ కూడా రాజధానిగా అమరావతిని సమర్థించాయని కన్నా పేర్కొన్నారు.

అయితే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై ముందుకు సాగుతున్న సమయంలో రాజధానిపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీ పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. తాజాగా, పరిపాలన వికేంద్రీకరణ పేర సీఎం జగన్ రాజధానిని తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు.

అయితే, తమ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకే మద్దతిస్తుందన్నారు. సీడ్ క్యాపిటల్, రాజ్ భవన్, సచివాలయం, అసెంబ్లీ, సీఎంవో సహా అన్నీ ఇక్కడే ఉండాలన్నారు. రాజధాని అంశం అభివృద్ధితో కూడుకున్న అంశమని చెబుతూ.. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని చంకన పెట్టుకునే పోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని కన్నా ప్రశ్నించారు.

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర వ్యవహారాల్లో సుమోటోగా కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాజధాని అంశం రైతుల సమస్య కాదని చెప్పారు. ఇది రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది అభివృద్ధితో ముడిపడిన అంశమన్నారు. మొదటి నుంచి రాజధాని అమరావతిలో ఉండాలని తాము చెబుతున్నామంటూ.. ప్రస్తుతం, రాజధానిపై జగన్ కు నిర్ణయం తీసుకునే హక్కు లేదన్నారు. త్వరలోనే అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ తమ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని వెల్లడించారు.