బొత్సను కలిసిన రాజధాని రైతులు.. మరోమారు మంత్రి హామీ!

11-01-2020 Sat 18:20
  • భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షలతో సమస్యలు
  • ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నామన్న రైతులు
  • సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామన్న బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఈరోజు కలిశారు. విజయవాడలోని ఆయన నివాసానికి రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు వెళ్లారు.

రాజధాని ప్రాంతంలోని భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షలు, అసైన్డ్ భూముల విక్రయాల రిజిస్ట్రేషన్ రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, లంక ప్రాంతాల్లోని భూముల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. క్రయ విక్రయాలపై ఆంక్షల కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్నీ రైతులు ప్రస్తావించారు. రాజధానికి ఇచ్చిన భూములను అభివృద్ధి పనుల నిమిత్తం వినియోగించకపోతే తిరిగి తమ భూములు తమకు ఇచ్చివేసే ఆలోచన చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన బొత్స.. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని, సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని మరోమారు స్పష్టం చేశారు. రైతులకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించిన బొత్స, అన్నదాతలకు సంబంధించిన ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.