రాజధానిగా అమరావతే ఉండాలి: రాష్ట్ర బీజేపీ ఏకగ్రీవ తీర్మానం

11-01-2020 Sat 18:05
  • సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష పోరాటం
  • సీడ్ క్యాపిటల్, సచివాలయం. అసెంబ్లీ.. అన్నీ ఇక్కడే..
  • మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారు?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర బీజేపీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ రోజు గుంటూరులో జరిపిన పార్టీ కోర్ కమిటీ భేటీలో అమరావతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివరాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించారు. రాజధాని అంశం మనకు సంబంధం లేనిదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొనగా, మిగతా సభ్యులు ఆయన వాదనతో విభేదించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉంటూ ఇక్కడి వ్యవహారాలతో సంబంధం లేదంటే ఎలా? అని వారు ప్రశ్నించారన్నారు.

మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారని సమావేశంలో చర్చించామన్నారు. చివరకు రాజధాని అమరావతిలోనే ఉండాలని పార్టీ నేతలు తీర్మానం చేశారని చెప్పారు. సంక్రాంతి తర్వాత అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ తమ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని చెప్పారు.

సీడ్ క్యాపిటల్, సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎంవో సహా కీలక విభాగాలన్నీ అమరావతి నుంచే పనిచేయాలని తీర్మానం చేశామని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో అమరావతిని రాజధాని చేయాలని చేసిన తీర్మానాన్ని బీజేపీ సహా వైసీపీ కూడా ఒప్పుకుందని.. ప్రస్తుతం విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపును ఒప్పుకుంటే మాటతప్పినట్లవుతుందని కన్నా పేర్కొన్నారు.