కేసీఆర్ ఎనిమిదో నిజాం.. ప్రజలు బానిసలుగా బతికే పరిస్థితి: మోత్కుపల్లి నర్సింహులు

11-01-2020 Sat 17:53
  • తెలంగాణకు పట్టిన ‘శని’ కేసీఆర్ 
  • గద్దెపై నుంచి ఆయన్ని దింపడానికి యాగం చేస్తా 
  • అశోకుడు మొక్కలు నాటిస్తే.. కేసీఆర్ వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నాడు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. చరిత్రలో అశోకచక్రవర్తి మొక్కలు నాటించాడని, నేడు సీఎం కేసీఆర్ మాత్రం వైన్ షాపులను ఏర్పాటు చేస్తున్నాడని విమర్శించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు పట్టిన ‘శని’ కేసీఆర్ ని గద్దె దింపడానికి యాగం చేస్తానని చెప్పారు.

కేసీఆర్ ను ఎనిమిదో నిజాంగా అభివర్ణించిన మోత్కుపల్లి, తెలంగాణ ప్రజలు బానిసలుగా బతికే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రజలకు అనుమతినివ్వడం లేదని, ఆయన కొడుకు, కూతురు, అల్లుడుకి తప్ప మరెవ్వరికీ ప్రవేశం లేదని విమర్శించారు.