Ashwini Dutt: మూడు రాజధానులు చిరంజీవికి ఎందుకు నచ్చాయో.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: అశ్వనీదత్

  • ఏ అనుభవంతో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారో 
  • పృథ్వీరాజ్ లాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు
  • హీరోలు మనుషులుగానైనా స్పందించాలి

ఏపీకి మూడు రాజధానులు సరైన నిర్ణయమేనని చిరంజీవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందిస్తూ, అది చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఏ అనుభవంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని అన్నారు. మూడు రాజధానులు చిరంజీవికి ఎందుకు నచ్చాయోనని ఎద్దేవా చేశారు. చిరంజీవి కానీ, పృథ్వీరాజ్ లాంటోడు కానీ ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

పృథ్వీరాజ్ అనేవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? అతని కాలిబర్ ఏంటి? అని అశ్వనీదత్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకోవడం జగన్ కు కూడా మంచిది కాదని అన్నారు. జగన్ కు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారని... ఆయన తండ్రి వైయస్సార్ చేసిన దాంట్లో పదో వంతు అమరావతిలో కూర్చొని చేసినా... రాబోయే 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు జగన్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే సినిమావాళ్లు కనీసం మనుషులుగానైనా స్పందించాలని అశ్వనీదత్ అన్నారు. ఇదే జిల్లాలో పుట్టిన సూపర్ స్టార్లు ఉన్నారని... అమరావతిపై వారికి వారు స్పందించాలని చెప్పారు. జనాలను స్టార్లు పట్టించుకోనప్పుడు... వాళ్లను జనాలు పట్టించుకోవడం మానేయాలని, వాళ్ల సినిమాలు చూడొద్దని అన్నారు.

More Telugu News