Hyderabad: డబ్బుల కోసం ఆ మోడల్ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తోంది: నిందితుల తల్లుల ఆరోపణ

  • మోడల్ రూ.20లక్షలు డిమాండ్ చేసిందన్న నిందితుల తల్లులు
  • పోలీసులు తీరుతో విసిగిపోయానన్న బాధితురాలు
  • నిందితులను అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు
  • నిందితుల తల్లుల ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటామన్న ఏసీపీ

హైదరాబాద్ లో ఓ మోడల్ పై అత్యాచారం జరిగిందంటున్న కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సదరు మోడల్ తమ కుమారులను రూ.20 లక్షలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని నిందితులైన రిషి తల్లి ఆదిలక్ష్మి, నిఖిల్ రెడ్డి తల్లి సునీత ఆరోపిస్తున్నారు. మగ పిల్లలను ట్రాప్ చేసి బెదిరింపులకు దిగితే.. ఆడపిల్లలపై చట్ట ప్రకారం కేసులుండవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘మా కుమారులు ఎలాంటి తప్పుచేయలేదు. తప్పంతా మోడల్ దే. ఆడపిల్ల కదా అని కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు’ అని వారు మీడియా ముందు వాపోయారు.

 నా కొడుకుతో మోడల్ పెళ్లికి కూడా సిద్ధ పడింది: రిషి తల్లి ఆదిలక్ష్మి 

ఆ మోడల్ తన కొడుకును ట్రాప్ చేసిందని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పినట్లు రిషి తల్లి ఆదిలక్ష్మి తెలిపారు. అయితే తాను తన కొడుకు మైనర్ అని చెప్పానని వివరించింది. ‘మైనర్ తో వివాహం కుదరదు అని చెప్పా. రెండేళ్ల తర్వాత రిషి మేజర్ అవుతాడు. అప్పుడు మీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేస్తామని కూడా చెప్పాం. మా అబ్బాయి తప్పు చేశాడని తేలితే ఏ శిక్ష విధించినా అడ్డు చెప్పను. మోడల్ మా అబ్బాయిని ఎలా ట్రాప్ చేసిందో అన్ని ఆధారాలున్నాయి. ఏసీపీకి ఫిర్యాదు చేస్తాం. డబ్బు కోసం మోడల్ తల్లిదండ్రులు కూడా దిగజారారు. వారు కూడా రూ.10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారు’ అని ఆదిలక్ష్మి తెలిపారు.

పోలీసుల తీరుతో మీడియా ముందుకు వచ్చా: బాధితురాలు

నిందితులిద్దరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. హైదరాబాద్ లో నివసిస్తోన్న ఓ మోడల్(21) నిన్న మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంగళవారం జూబ్లిహిల్స్ పీఎస్ కు వెళితే తనదే తప్పన్నట్లు చూశారని ఆమె పేర్కొన్నారు. దీంతో తాను మీడియా ముందుకు వచ్చానన్నారు.

దీనిపై బంజారా హిల్స్ ఏసీపీ కేఎస్ రావు స్పందిస్తూ తాము ఫిర్యాదు తీసుకున్నామని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఐపీసీ 376 కింద నిందితులపై కేసు నమోదు చేశామని.. నిందితుల తరపువారు చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. 

More Telugu News