Iran: విమానం కూల్చివేత.. ఇరాన్ నుంచి భారీ నష్టపరిహారాన్ని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

  • కూల్చివేతపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి
  • కారకులైనవారిని చట్టం ముందు నిలబెట్టాలి
  • ఇరాన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలి

ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం తమ వల్లే కూలిపోయిందని... అయితే, కేవలం మానవ తప్పిదం కారణంగానే అది జరిగిందని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. జరిగిన ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ జరపాలని, దీనికి కారకులైనవారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. దౌత్య మార్గాల ద్వారా అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన దానికి భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలని అన్నారు.

ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా విచారణను ఇరాన్ కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు చెందిన ఓ విచారణ బృందం ఇప్పటికే ఇరాన్ లో ఉందని చెప్పారు. 45 మంది నిపుణులతో కూడిన తమ టీమ్ కు ఇరాన్ సహకరించాలని, వారికి కావాల్సిన అన్నింటినీ అందుబాటులో ఉంచాలని కోరారు. ఇరాన్ కూల్చేసిన ఈ విమానంలో ఉన్న మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

More Telugu News