అది నాకు సంబంధం లేని విషయం: శిఖర్ ధావన్

11-01-2020 Sat 14:57
  • వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా
  • అక్టోబర్ లో టీ20 వరల్డ్ కప్
  • ఓపెనింగ్ స్లాట్ కు గట్టి పోటీ

ఇటీవలి కాలంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఒక్కో జట్టును చిత్తు చేస్తూ సత్తా చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ బలంగా ఉంది. రోహిత్ శర్మతో కూడిన టాప్ ఆర్డర్ భారీ స్కోర్లకు పునాది వేస్తుండగా... స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంలో మిడిల్ ఆర్డర్ తన వంతు పాత్రను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్ మెంట్ కు పెద్ద తలనొప్పి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేయడం సవాల్ గా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్లాట్ ను ఎంపిక చేయడం కష్టసాధ్యంగా మారింది.

ఓపెనింగ్ కు సంబంధించి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లలో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ధావన్ మాట్లాడుతూ, తాము ముగ్గురం మంచి ఫామ్ లో ఉన్నామని చెప్పాడు. రోహిత్ అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని... రాహుల్ గత రెండు, మూడు నెలలుగా బాగా రాణిస్తున్నాడని... శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో తాను కూడా బాగా ఆడానని తెలిపాడు. జట్టు ఎంపికతో తనకు సంబంధం లేదని... అందుకే తాను దాని గురించి ఎక్కువ ఆలోచించడం లేదని చెప్పాడు. తనకు వచ్చిన రెండు అవకాశాలను తాను చక్కగా వినియోగించుకున్నానని... అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు.